
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్: గోల్కొండ కోటలో రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు, పంద్రాగస్టు వేడుకలకు హాజరైన సీఎం కెసిఆర్. 1200 మంది కళాకారుతో పంద్రాగస్టు వేడుకలు… గోల్కొండ కోటలో జాతీయ జెండాను సీఎం కెసిఆర్ఎ గరావేశారు. అనంతరం ఆయన ప్రసంగిచారు..మిషన్ కాకతీయ, పెండింగు ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతోపాటు ఇతర మధ్యతరహా, చిన్న ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటిరంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయరంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి, భారత దేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైంది.
ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబును ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానానికి పోటీపడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే, కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలసల జిల్లాగా పేరుపడి గోసెల్లదీసిన పాలమూరుతోపాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతేర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడంతోపాటు, 1200 గ్రామాలకు తాగునీరందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజలను ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే, న్యాయం ఎన్నటికైనా గెలుస్తుంది అన్న నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాల ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి. ఇటీవలనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లభించాయని సంతోషంగా తెలియజేస్తున్నాను.
ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న పెద్ద అవరోధం తొలగిపోయింది కనుక సత్వరమే సాగునీటి కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వహించి, అతి త్వరలోనే ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేసి, పాలమూరు రంగారెడ్డి జిల్లాలను సంపూర్ణంగా పచ్చని పంటల జిల్లాలుగా తీర్చిదిద్దుతుందని హామీ ఇస్తున్నాను. తాగునీటి అవసరాల కోసం రాబోయే కొద్దిరోజుల్లోనే రిజర్వాయర్లకు నీటి ఎత్తిపోతలను ప్రారంభిస్తామని ఈ సందర్బంగా ఆయన తెలియజేసారు.