
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, రానున్న కాలంలో మరిన్ని సంక్షేమ పథకాలతో నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అరెకపూడి గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గాంధీ ఇంటింటి ప్రచారం చేశారు.స్థానికులతో కలిసి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటువేసి మరోసారి గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల సహకారంతో రూ.9 వేల కోట్ల నిధులతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పేదలకు అందుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని, ఈ విజయాన్ని కేసీఆర్ కు కానుకగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.