
తెలంగాణ మిర్రర్, తిరుమల: తిరుమలలో రెండవ (అప్ ఘాట్) రోడ్డు పునరుద్ధరణ పనులను పూర్తి చేసి టిటిడి అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభించారు. అనంతరం అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ డిసెంబర్ 1న కురిసిన భారీ వర్షాల కారణంగా రెండో ఘాట్ (అప్ ఘాట్) రోడ్డులో భారీ బండరాళ్లు పడటం వలన మూడు ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నట్లు చెప్పారు. అయితే జనవరి 10వ తేదీకి అప్ ఘాట్ రోడ్డును భక్తులకు అందుబాటులోనికి తీసుకురావలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే సిఇ ఆధ్వర్యంలో టిటిడి ఇంజినీరింగ్ అధికారులు, ఆఫ్కాన్ సంస్థ ప్రతినిధులు కలిసి పగలు, రాత్రి విరామం లేకుండా ఘాట్ రోడ్డు మరమ్మతు పనులను శరవేగంగా పూర్తి చేసి నిర్ణీత సమయంలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అయితే అక్కడక్కడ చిన్నపాటి మరమ్మత్తు పనులు పూర్తి చేయవలసి ఉండగా భారీ వాహనాలు లింక్ రోడ్డు ద్వారా మాత్రమే అనుమతించబడతాయని చెప్పారు. దాదాపు 40 రోజుల తరువాత భక్తులకు ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాం ప్రారంభించామన్నారు. టిటిడి ఇంజినీరింగ్ విభాగం అధికారులు చేసిన కృషికి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి తరపున అదనపు ఈవో హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదనపు ఈవో టిటిడి సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ – 2 జగదీశ్వర్ రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్ రెడ్డి, విజివో బాలి రెడ్డి, డీఎస్పీ ప్రభాకర్, ట్రాఫిక్ డీఎస్పీ వేణుగోపాల్, డెప్యూటీ ఇఇ రమణ, ఆఫ్కాన్ ఇన్‌ఛార్జ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.