Home » శ్రీవారి సేవలో… సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ

శ్రీవారి సేవలో… సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ

by Admin
1.1kViews

 – తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయి

– రెండేళ్ల తరువాత సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించడం సంతోషం

– సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

 

తెలంగాణ మిర్రర్,తిరుమల: తిరుమల లో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మెచ్చుకున్నారు. రెండేళ్ల తరువాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. ఆదివారం ఉదయం శ్రీవారి ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియా తో మాట్లాడారు. శ్రీవారి ఆశీస్సులు అందుకుని భక్తులు ఆనందించే వాతావరణం ఏర్పడిందన్నారు. భవిష్యత్తు లో కోవిడ్ లాంటి వ్యాధులు సోకకుండా ప్రపంచాన్ని కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ఆయన ప్రార్థించారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. సతీసమేతంగా ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్ రమణను చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్‌” మర్యాదలతో స్వాగతం పలికారు. అనంత‌రం ఆయ‌న ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు.

రంగనాయకుల మండపంలో చీఫ్ జస్టిస్‌కు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె  ఎస్ జవహర్ రెడ్డి, ఆదనవు ఈవో ధర్మారెడ్డి ఎన్‌వి. రమణకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, ఆంజనేయుని జన్మస్థలం పై టీటీడీ ముద్రించిన పుస్తకం అందజేశారు. శ్రీవారి దర్శనం అనంతరం జస్టిస్ ఎన్‌వి.రమణ దంపతులు బేడీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. తరువాత అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమం లో తిరుప‌తి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, డెప్యూటీ ఈవోలు హ‌రీంద్ర‌నాథ్‌, లోక‌నాథం, విజివో బాలిరెడ్డి పాల్గొన్నారు.

You may also like

Leave a Comment