
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాలన అవినీతికి మోడల్ గా మారిందని తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై ఆరోపించారు.మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆలిండ్ ఫ్యాక్టరీ నుండి చందానగర్ క్రిస్టల్ గార్డెన్ వరకు వేలాదిమంది కార్యకర్తలు, యువకులు, మహిళలతో రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై,మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు పాల్గొని శేరిలింగంపల్లి బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పడు కేసీఆర్ చాలా వాగ్దానాలు చేశారని, అధికారంలోకి వచ్చిన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఆరున్నర లక్షల కోట్లు అప్పులు చేశారని మండిపడ్డారు.కేసీఆర్ తన అవినీతితో రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. 8 కోట్ల జనాభా కలిగిన తమిళనాడు రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల అప్పు ఉంటే.. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ర్టం రూ.6.5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.దేశమంతా ఇప్పుడు నరేంద్రమోదీ మోడల్ కోరుకుంటోందని చెప్పారు. బీజేపీ హయంలో అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామని చెప్పారు. బీఆర్ఎస్ .. కాంగ్రెస్ కు బీటీమ్, ఎంఐఎం.. బీఆర్ఎస్ కు బీ టీమ్ అని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తాడనే రవికుమార్ యాదవ్ కు బీజేపీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. రవికుమార్ యాదవ్ లాంటి మంచి వ్యక్తికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.