
*ఆరోగ్యమిత్ర”కు బండారు దత్తాత్రేయ అభినందనలు.
*భారతీయులది ఆరోగ్యమిత్ర సంస్కృతి – యోగానంద్.
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి: జీవన మనుగడకు ఆరోగ్యమే ప్రధానం… అందుకే మన భారతీయుల జీవితం యుగయుగాలుగా ఆరోగ్యానికి మూలమైన ప్రకృతితో మమేకమవుతూ వచ్చింది. అయితే, నేడు మారిన జీవనసరళితో ఆరోగ్య ప్రమాణాలు కూడా మారుతూ అనారోగ్య పరిస్థితులు పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో మన భారత ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ‘ఆయుష్మాన్ భారత్’ ‘స్వచ్ఛభారత్’ లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. ఈ సందర్బంగా గచ్చిబౌలిలోని హొటల్ రాడిసన్ వేదికగా గజ్జల యోగానంద్ ఫౌండేషన్ (GY Foundation) ద్వారా “ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ నేటి కరోనా పీడిత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన ఆవశ్యకతను వివరించారు. “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవలకు శ్రీకారం చుట్టిన గజ్జల యోగానంద్ (GY Foundation) కార్యకలాపాలను, యోగానంద్ సేవాతత్పరతను ఆయన ప్రశంసించారు. అదేవిదంగా “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవలకు సాంకేతిక సహకారం అందిస్తున్న ధనుష్ హెల్త్ కేర్ అధినేత డిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ప్రాజెక్ట్ పనితీరును వివరించారు. యోగానంద్ మాట్లాడుతూ మన భారతీయులది మొదటి నుంచీ ఆరోగ్యమిత్ర సంస్కృతి అని పేర్కొన్నారు. మారుతున్న కాలంలో ఆరోగ్యప్రమాణాలు పతనం అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఒక బాధ్యతగల పౌరునిగా తమ గజ్జల యోగానంద్ ఫౌండేషన్ (GY Foundation) ద్వారా “ఆరోగ్యమిత్ర” పేరిట టెలీమెడిసిన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవల కోసం నమోదు చేసుకున్నవారు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య సేవలు పొందవచ్చని, ఆరోగ్య సమస్యల పరిష్కారానికి గాను నిపుణులైన వైద్యుల సలహాలు పొందవచ్చని తెలిపారు. ధనుష్ హెల్త్‌కేర్ వారి సాంకేతిక పరిజ్ఞాన సహకారంతో ఆరోగ్యమిత్ర టెలీమెడిసిన్ సేవలను అధునాతన టెక్నాలజీ ద్వారా నాణ్యతా ప్రమాణాలతో అందించేందుకు శిక్షణ పొందిన ఆరోగ్య కార్యకర్తలను వినియోగించడం జరుగుతుంది. గజ్జల యోగానంద్ ఫౌండేషన్ నేతృత్వంలో కోవిడ్ లాక్ డౌన్ సమయంలో కరోనా బాధిత కుటుంబాలకు ఎన్నో విధాలుగా చేయూతనిచ్చింది. ఇటీవల పౌర సమస్యలను పరిష్కారం కోసం సిటిజన్ కన్సల్టేషన్ సెంటర్‌ను కూడా నెలకొల్పిదన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం గజ్జల యోగానంద్ ఫౌండేషన్ చేపట్టిన ఈ “ఆరోగ్యమిత్ర” టెలీమెడిసిన్ సేవలను ప్రజలందరు వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వినాయక్ కిషన్ పంపాటి, సామ రంగారెడ్డి, జనార్దన్ రెడ్డి, టీటీడీ పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.