
*మాదాపూర్ హైటెక్స్‌లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్ అన్నారు.మాదాపూర్ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రభుత్వ విప్,శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి,నల్లమోతు భాస్కర్ రావు,క్రెడాయ్ ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు..బయటి రాష్ట్రాల వాళ్లు బతుకుదెరువుకోసం తెలంగాణకు వస్తున్నారని, కానీ మనవాళ్లు దుబాయ్ పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. స్థానికులకు ఉపాధి కల్పించేలా క్రెడాయ్ ముందుకు రావాలని సూచించారు. తెలంగాణ యువతకు శిక్షణ ఇవ్వాలన్నారు. అందుకు అవసరమైన సాయం ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దక్షిణ తెలంగాణపై క్రెడాయ్ దృష్టిపెట్టాలని సూచించారు.సీఎం కేసీఆర్‌ను విమర్శించడమే విపక్షాలకు తెలుసునని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణకు ఏం చేస్తారో విపక్ష నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఏడు శాతం గ్రీన్ కవర్ పెంచిన ఏకైక సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం పూర్తిచేశామన్నారు. అభివృద్ధి పనుల కోసం అప్పులు చేస్తున్నామని, భవిష్యత్ తరాల కోసం పెట్టే పెట్టుబడిని అప్పులుగా చూడరాదని వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు మాస్టర్ ప్లాన్‌లు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. 18 నెలల్లో హైదరాబాద్‌కు కొత్త మాస్టర్‌ప్లాన్ తయారుకానుందని తెలిపారు. సొంత జాగా ఉన్నవారు ఇళ్లు కట్టుకుంటే రూ.3 లక్షలు ఇస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెరాస పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేష్ ,మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ , క్రెడాయ్ నాయకత్వ బృందం అధ్యక్షుడు పి. రామకృష్ణారావు: జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జి. ఆనంద్ రెడ్డి,కె రాజేశ్వర్, ఎన్ జైదీప్ రెడ్డి, బి జగన్నాధ్ రావు ; ట్రెజరర్ ఆదిత్య . జాయింట్ సెక్రటరీలు శివరాజ్ ఠాకూర్,కె రాంబాబు,ఈసీ సభ్యులు, సభ్య డెవలపర్లు,సరఫరాదారులు,ఆర్థిక సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.