Home » మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో కోవిడ్-19 ఉపశమనం

మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో కోవిడ్-19 ఉపశమనం

by Admin
1.4kViews

*మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో కోవిడ్-19 ఉపశమనం

*మోనోక్లోనల్ అధ్యయన అంశాలను వెల్లడించిన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి.

తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి: కోవిడ్ -19 సోకిన వారిపై మోనో క్లోనల్ యాంటీబాడీ థెరపీ వంద శాతం పనిచేస్తుందని, మరణాలను నివారించేలా ఈ థెరపీ పనిచేస్తుందని మా అధ్యయనంలో రుజువుచేశామని ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోనోక్లోనల్ యాంటీ బాడీ థెరపి పై చేసిన అధ్యయనం గురించిన వివరాలను వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మోనోక్లోనల్ యాంటీబాడీ డ్రగ్ కాక్‌టెయిల్ నిర్వహించినప్పటి నుండి కోవిడ్ – 19 కి నివారణగా ప్రపంచ దృష్టిని ఆకర్షించిందన్నారు. ప్రాథమిక శాస్త్రీయ ఆధారాలు సరిగాలేక దాని ప్రభావాన్ని చూపించేందుకు అధ్యయనాలు చేశారన్నారు. సార్స్ కోవ్ 2 డెల్టా వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎలాంటి అధ్యయనం జరగలేదన్నారు. పీర్ సమీక్షించిన హై ఇంపాక్ట్ జర్నల్‌లో ఏఐజీ హాస్పిటల్స్, సీసీఎంబీ హైదరాబాద్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌తో పాటు ప్రపంచంలో మొదట ప్రచురించిన అధ్యయనంలో మోనోక్లోనల్ థెరపీ వ్యాధి సోకిన వారిలో తీవ్రమైన వ్యాధి, మరణాలను తగ్గిస్తుందని విజయవంతంగా నిరూపించిందన్నారు. డెల్టా వేరియంట్ సార్స్ కోవి 2 ప్రమాదకరమైన వేరియంట్ అని, అధిక ఇన్ఫెక్టివిటీని కలిగి ఉంటుందన్నారు. ఇతర వేరియంట్‌ల కంటే వైవిధ్యమైన ఉత్పరివర్తనాలతో ఎక్కువ వ్యాప్తి చెందే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో, డెల్టా కారణంగా రెండవ అల విధ్వంసం సంభవించిందన్నారు. అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులు, 60 ఏళ్లు పైబడిన లేదా 60 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు, మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, గర్భిణీ స్త్రీలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులలో COVID-19 చికిత్స కోసం ప్రజారోగ్య విధానాన్ని రూపొందిస్తుందన్నారు. మోనోక్లోనల్ థెరపీ వ్యాధి పురోగతిని పూర్తిగా నిలిపివేస్తుందని మేము మా పరిశోధనలో స్పష్టంగా నిరూపించామన్నారు. 285 మంది రోగులపై అధ్యయనం చేశామన్నారు. పరీక్షించబడిన 98 శాతం కంటే ఎక్కువ నమూనాలు డెల్టా వేరియంట్‌గా గుర్తించబడ్డాయని, మోనోక్లోనల్ థెరపీని పొందిన 75 శాతం మంది రోగులు 7వ రోజు నాటికి ఆర్టీపీసీఆర్ కు ప్రతికూలంగా మారారని అన్నారు. 78 శాతం మంది రోగులు 7వ రోజు నాటికి జ్వరం, దగ్గు తదితర వ్యాధి లక్షణాల నుండి ఉపశమనం పొందారన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఎవరూ తీవ్రమైన వ్యాధికి గురికాలేదని, ఏ ఒక్క మరణం సంభవించలేదని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. అనంతరం ఎవరిలోనూ కోవిడ్ లక్షణాలు కనబడలేదన్నారు. మోనోక్లోనల్ థెరపీ న్యూట్రలైజింగ్ యాక్టివిటీ అసలు వుహాన్ స్ట్రెయిన్, డెల్టా స్ట్రెయిన్ రెండింటిలోనూ ఒకేలా ఉందన్నారు. ఈ అధ్యయనాన్ని నిర్వహించడానికి మూడు ప్రధాన శాస్త్రీయ సంస్థలు ఉన్నాయని, ఏఐజీ హాస్పిటల్స్ దాని పరిశోధనా విభాగం, ఏషియన్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ ఈ అధ్యయనానికి రూపకల్పన, నిధులు సమకూర్చాయన్నారు. సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డెల్టా వేరియంట్‌ను గుర్తించడానికి, నిర్ధారించడానికి సేకరించిన వైరస్ జాతుల జన్యువును క్రమం చేయడంలో నిమగ్నమైందన్నారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం కాక్ టెయిల్ తటస్థీకరణ చర్యను పరీక్షించిందని వెల్లడించారు.  మధుమేహం, రక్తపోటు తదితర వ్యాధులతో బాధపడేవారితో పాటు దేశంలో కోవిడ్ భారిన పడి ఆసుపత్రిలో చేరడానికి అయ్యే ఖర్చును పరిశీలిస్తే, మోనోక్లోనల్ థెరపీ వ్యయం చాలా తక్కువ అని పేర్కొన్నారు. వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు మరణాలను నివారిస్తుందని తెలిపారు. ఆసుపత్రిలో చేరిన రోగులలో ఈ డ్రగ్ కాక్ టైల్ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని, ఈ థెరపీని రోగనిరోధకంగా ఉపయోగించడానికి అన్వేషిస్తున్నాము అని డాక్టర్ రెడ్డి చెప్పారు.

You may also like

Leave a Comment