
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : మత్తు పదార్థాలు రవాణా చేస్తున్న ఇద్దరినీ శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి 8 లక్షల విలువైన మత్తుపదార్థాలు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. గురువారం శేరిలింగంపల్లి ఎక్సైజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ రెడ్డి వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ కు చెందిన నిలేష్, మనీష్ లు బాలానగర్ లోని ఫతేనగర్ లో నివాసం ఉంటున్నారు. వీరు ఈజీ మనీ కోసం మత్తుపదార్థాల దందాకు పాల్పడుతున్నారు.కాగా గురువారం ఉదయం విప్రో సర్కిల్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో కనిపించిన నిలేశ్, మనీష్ లను అదుపులోకి తీసుకొని విచారించగా వారివద్ద 60 గ్రాముల గంజాయి, 20 గ్రాముల చరస్ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకొని వారి ఇండ్లలో సోదా చేయగా కిలో పైన ఉన్న గంజాయి, 50 గ్రాముల చరస్ దొరికింది. దీని విలువ సుమారు 8 లక్షల పైన ఉంటుందని పోలీసులు తెలిపారు.వీరి నుండి మత్తు పదార్థాలతో పాటు ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో డీఎఫ్ డీ సీఐ ప్రవీణ్ కుమార్ , శేరిలింగంపల్లి ఎక్సైజ్ సీఐ లక్ష్మణ్ గౌడ్ , శ్రీశాంత్ రెడ్డి, శ్రీనివాస్ ,యాదయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.