
* వృద్ధాప్య సమస్యలతో సొంతూరులో కన్నుమూత ఎ శ్యామ్ శరణ్ నేగి మృతిపై ప్రధాని మోడీ సంతాపం.
* ప్రగాఢ సానుభూతి తెలిపిన ఎన్నికల కమిషన్.
* నాలుగు రోజుల క్రితమే.. పోస్టల్ బ్యాలెట్ లో ఓటు వేసిన నేగి.
తెలంగాణ మిర్రర్, హైదరాబాద్ (సిమ్లా) : స్వతంత్ర భారత తొలి ఓటరు శ్యామ్ శరణ్ నేగి (106) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. శ్యామ్ నేగి హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ లో జులై 1, 1917న జన్మించారు. 1951 సాధారణ ఎన్నికల్లో ఆయన ఓటు వేశారు. అప్పటినుంచి ప్రతిసారి తన ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల కోసం ఆరోగ్యం సహకరించకపోవడంతో రెండు రోజులు క్రితం పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శ్యామ్ నేగి అంత్యక్రియలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని, ఆయనకు గౌరవప్రదంగా వీడ్కోలు పలికేందుకు బ్యాండ్ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కిన్నౌర్ అబిద్ హుస్సేన్ తెలిపారు. శ్యామ్ నేగి కల్పాలో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన హిందీ చిత్రం సనమ్ రేలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు. 2014లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం యువ ఓటర్లలో ఎన్నికల వ్యవస్థలో పాల్గొనేలా అవగాహన కల్పించేందుకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. శ్యామ్ నేగి మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణవార్తను వినడం బాధాకరంగా ఉందని అని సీఎం ట్వీట్ చేశారు. లహిమాచల్ ప్రదేశ్లోని మొత్తం 68 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 12న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. శ్యామ్ శరణ్ నేగి (106) మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర ద్రిగ్బంతి వ్యక్తం చేశారు. శ్యామ్ కుటుంబీలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్యామ్ శరణ్ నేగి తుది శ్వాస విడిచే వరకూ బాధ్యతాయుత పౌరుడిగా తన కర్తవ్యాన్ని నెరవేర్చారన్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో నవంబర్ 2న పోస్టల్ బ్యాలెట్ ద్వారా శ్యామ్ ఓటు వేసిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. దీనిపై దేశంలోని ప్రతి పౌరుడు ఆలోచించుకోవాలని, శ్యామ్ శరణ్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.