
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : బీజేపీకి సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన వర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీజేపీలో సామాజిక న్యాయం లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 18 లక్షలకు పైగా కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారని… అయినా, ఒక్క సీటు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. కమ్మ సామాజికవర్గానికి టికెట్ కేటాయించకపోవడం బాధను కలిగించిందని చెప్పారు.పార్టీ మారి వచ్చిన వ్యక్తికి కనీసం తమతో చర్చించకుండానే టికెట్ ఇచ్చారని విమర్శించారు. టికెట్ కేటాయించి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంత వరకు బీజేపీ హైకమాండ్ నుంచి తమకు ఎలాంటి హామీ లభించలేదని చెప్పారు. తనను నమ్ముకున్న నేతలు, కార్యకర్తల కోసం బీజేపీకి రాజీనామా చేశానని తెలిపారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.