Home » ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యఅంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

by Admin
13.1kViews
80 Shares

తెలంగాణ మిర్రర్, శేరిలింగంపల్లి :  అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో మాదాపూర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ (సెంట్రల్) విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం ఆచార్యులు దేవారెడ్డి విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. మాతృభాషలో ప్రావీణ్యం సంపాదించగలిగితే అన్య భాషల్లో ప్రావీణ్యం సంపాదించడానికి సులువుగా ఉంటుందని పేర్కొన్నారు. మన భావాలను ఎదుటివారికి అర్థమయ్యే రీతిలో వ్యక్తపరచడానికి మాతృభాష ద్వారానే సులువుగా ఉంటుంది అని అన్నారు. మాతృభాష జాతిఉనికిని, సంస్కృతిని, జాతి జనుల నీతినిజాయితీని, మంచి నడవడికను, జీవన విధానాన్ని నేర్పుతుంది అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల భాషలు ఉన్నా, కొన్ని వందల భాషలకే విద్యావ్యవస్థలో చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మాతృభాషలు అంతర్ధానమయ్యే స్థితిలో ఉన్నాయి. ఆంగ్లభాష ప్రభావానికి లోనైన ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మాతృభాషలు బక్కచిక్కి కనుమరుగైపోయాయి. ప్రపంచభాషల్లో 230 భాషలు పూర్తిగా అంతరించాయి. ఇంకా 3000 భాషలు అంతరించే దశలో ఉన్నాయని యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ )నివేదికలు తెలుపుతున్నాయి ఆమె పేర్కొన్నారు. ఒక భాష మాట్లాడే జనాభాలో 30 శాతం మంది తమ భాషను మాట్లాడకుండా దూరమైతే.. ఆ మాతృభాష మనుగడ కోల్పోయినట్లు పరిగణిస్తారు. శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక అభివృద్ధి కారణంగా విదేశాల్లో అవకాశాల్ని అందుకోవాలని మన రాష్ట్రాల్లోని యువత ఆంగ్లవిద్యకు మొగ్గుచూపుతున్నారు. దిశానిర్దేశం చేయవలసిన పాలకులు కూడా వంతపాడుతూ మాతృభాషకు అన్యాయం చేస్తున్నారు. మన దగ్గరకు విదేశీ వస్తువులు, అలవాట్లు, విధానాలతో పాటు పరభాషను దిగుమతి చేసుకుని స్థానిక భాషలను విస్మరిస్తున్నారు. బహుళ ప్రపంచ వాణిజ్యం పేరుతో వసుదైక కుటుంబంలా తయారవుతూ, “ఒకే భాష -ఒకే సంస్కృతి” అన్నట్లుగా ఆంగ్లమయంగా మారుతుంది. ప్రపంచీకరణ వల్ల ప్రపంచం అంతా మనకు దగ్గరవుతుండగా, మన భాషలు మాత్రం మనకు దూరం అవుతున్నాయి. భాష-సమాజం-సంస్కృతి మన నుండి దూరమయి పోతే మనదైన మనుగడ తెలియనిదై పోతుంది. పై మూడూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు భాషలో మార్పు రావటానికి కొన్ని తరాలు పడితే, ఇప్పుడు ఒక్క తరములోనే ఎన్నో మార్పులను చూస్తున్నాం అని అన్నారు .అమ్మ భాషను పరిరక్షించుకోవడానికి 1999వ సంవత్సరం ఫిబ్రవరి 21న యునెస్కో వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ప్రకటించి, ప్రపంచమంతా అమలు చేస్తున్నారు. ఈరోజును ఎంచుకోవడానికి ప్రధాన కారణం బంగ్లాదేశ్ దేశ విభజన తర్వాత తూర్పు పాకిస్తాన్ గా పిలవబడే బంగ్లాదేశీయుల మాతృభాష బెంగాలీ. కానీ వారి భాషకు తగిన గుర్తింపు ఇవ్వక బలవంతంగా వేరుభాషను వారిపై రుద్దాలని చూచినపుడు మాతృభాష గుర్తింపుకై ఉద్యమించి పోలీస్ కాల్పుల్లో ఫిబ్రవరి 21 ను అసువులు బాసి అమరులయ్యారు. వారి జ్ఞాపకార్థం ఫిబ్రవరి 21ని ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో ప్రకటించింది అన్నారు. పై చదువులకూ, ఉద్యోగాలకూ, ఉదర పోషణకూ ఎన్ని భాషలను నేర్చుకున్నా అమ్మ భాష ఐన  మాతృభాషను మరవద్దు అని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బసవలింగం, అధ్యాపకులు GM స్వామి,G క్రిష్టయ్య ,విద్యార్థినీ విద్యార్థులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విష్ణుప్రసాద్, కౌండిన్యశ్రీ నండూరి వెంకటేశ్వరరాజు, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment