
తెలంగాణ మిర్రర్, శంకర్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యాలయాలు ప్రారంభం కానున్ననందున ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, అన్ని విద్యా సంస్థలలో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లా, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో సత్తయ్య, జడ్పిటిసి గోవిందమ్మ, పర్వేద, మసాని గూడా, ప్రభుత్వపాఠశాలలో కలసి గురువారం వారు సందర్శించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటిస్తూ పాఠశాలలకు హాజరయ్యేలా చూడాలని ఆయన సూచించారు. విద్యాలయాలలో కూడా పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధంగా చూడాలని అధికారులు తెలిపారు. ఆగస్టు 28 లోగా అన్ని విద్యాలయాలలో పూర్తిస్థాయిలో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉండేటట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికేట్ ఇవ్వాలని అయన కోరారు. విద్యాలయాలు ప్రారంభం అయిన పిదప ప్రతిరోజు పంచాయతీ గ్రామస్థాయిలో గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు ప్రభుత్వ పాఠశాలన్నింటిని శుభ్రంగా ఉంచే విధంగా బాధ్యత వహించాలని కోరారు. ప్రభుత్వ విద్యాలయాల ప్రాంగణంలో ఉన్న తరగతి గదులను, కిచెన్ షెడ్లు, మరుగుదొడ్లను, ఫర్నిచర్ ను శుభ్రపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యాసంస్థల పైనున్న నీటి ట్యాంకులను శుభ్రం చేసుకోవాలని, విద్యాలయ ప్రాంగణంలో పిచ్చి మొక్కలను తొలగించి ఏ విధమైన చెత్తాచెదారం లేకుండా చూడాలని, త్రాగునీటి వసతులైన నల్లాలనూ, ట్యాంకులను శుభ్రపరచాలని ఆదేశించారు.
మిషన్ భగీరథ అధికారులు ప్రతి విద్యా సంస్థను తప్పక సందర్శించి అన్ని విద్యా సంస్థలకు నీటి వసతి ఉండే విధంగా ఈనెల 28వ తేదీలోగా చేయాలని ఆయన కోరారు. విద్యాలయాలు, అంగన్‌వాడిలు ప్రారంభం అయిన నాటి నుండి ప్రతిరోజూ శుభ్ర పరిచే విధంగా మండల పంచాయతీ అధికారులు, ఎంపిడివోలు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు శ్రద్ధ తీసుకోవాలని కోరారు. ప్రతిరోజు పాఠశాలను సందర్శించి పాఠశాలలు శుభ్రంగా ఉండే విధంగా చూడాలన్నారు. రాష్ట్రంలోని గ్రామపంచాయతీలలో నిధులకు కొరత లేదని, అందువల్ల విద్యాలయాలు తప్పక శుభ్రం చేయాలని ఆదేశించారు.