Home » తిరుమల లో పంచగవ్య ఔషదాలతో చికిత్స కేంద్రం ప్రారంభం

తిరుమల లో పంచగవ్య ఔషదాలతో చికిత్స కేంద్రం ప్రారంభం

by Admin
1.3kViews

*ఏప్రిల్ 3న పంచగవ్య ఔషదాలతో చికిత్స కేంద్రం ప్రారంభ

*గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం ఏర్పాటు

*టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి

తెలంగాణ మిర్రర్, తిరుమల : తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద ఆసుపత్రిలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పంచగవ్య ఔషధాలతో చికిత్స అందించేలా ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

టిటిడికి రోజువారీగా అవసరమయ్యే 3 వేల లీటర్ల పాలు, 60 కిలోల నెయ్యి సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలన్నారు.

తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో శుక్రవారం సాయంత్రం గోసంరక్షణ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, టీటీడీ ఆస్తులకు జియో ఫెన్సింగ్ అంశాలపై ఈవో అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, దేశవాళీ ఆవుల సేకరణకు అధికారుల బృందం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి గోశాలలో నెయ్యి తయారీ కేంద్రం ఏర్పాటు చేయడానికి భవన నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ తయారయ్యే పాలు, పెరుగు తిరుమలలోని అన్నదానం కాంప్లెక్స్ కు పంపాలని ఆయన తెలిపారు. రైతు సాధికార సంస్థ ద్వారా గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం ఇప్పటిదాకా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో రైతులకు 1300 కు పైగా ఆవులు, ఎద్దులు ఉచితంగా ఇచ్చామన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని గోశాలల నిర్వాహకులకు గో ఆధారిత ఉత్పత్తుల తయారీ, గోసంరక్షణ అంశాలపై ఇస్కాన్ సహకారంతో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని గో శాలలు స్వయం సంవృద్ధిగా తయారయ్యేందుకు అవసరమైన అంశాలు శిక్షణలో ఉండాలని ఈవో చెప్పారు.

తిరుపతిలోని ఆయుర్వేద వైద్యశాలలో పంచగవ్య ఔషధాలతో చికిత్సాలయం ఓపి, 12 పడకలతో ఇన్ పేషెంట్ విభాగం ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పంచగవ్య ఉత్పత్తుల్లో నాణ్యత ప్రమాణాలు స్థిరీకరించడం కోసం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతి ఆస్తికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా టీటీడీ కి ఉన్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షించేందుకు వీలుగా ప్రతి ఆస్తికి జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఈవో ఎస్టేట్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కు చెందిన నీర్ ఇంటరాక్టివ్ సంస్థ ప్రతినిధులు జియో ఫెన్సింగ్ ఏర్పాటుపై డెమో చూపించారు. ఇది వరకే జియో ఫెన్సింగ్ చేసిన ఇతర సంస్థల ఆస్తుల భద్రతను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు.

అదనపు ఈవో  ధర్మారెడ్డి, జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో గోపీనాథ్ జెట్టి, ఎఫ్ ఏ సి ఏవో బాలాజి, చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, ఎస్ ఈ  జగదీశ్వర్ రెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ మల్లిఖార్జున, ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్  మురళీకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment