
శేరిలింగంపల్లి,తెలంగాణ మిర్రర్ : క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రిస్మస్ ట్రీ వినూత్నంగా రూపొందించారు. రాడిస్సన్ హైదరాబాద్ హైటెక్ సిటీ హోటల్లో ఏర్పాటుచేసిన “ముత్యాల క్రిస్మస్ ట్రీ” ఆకట్టుకుంటుంది. గతేడాది 35 లక్షల రూపాయల విలువైన పోచంపల్లి చీరలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ ఎంతో ఆదరణ పొందింది. పోచంపల్లి చీరలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ గత ఏడాది స్థానిక కళను ప్రోత్సహించగలిగింది. కళలను ప్రోత్సహించేందుకు ముందుకువచ్చిన రాడిస్సన్ హైదరాబాద్ హైటెక్ సిటీ హోటల్ ఈ సంవత్సరం హైదరాబాద్ ముత్యాలతో ప్రత్యేకంగా క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసింది.రాడిస్సన్ హైటెక్ సిటీ హోటల్ యాజమాన్యం వోకల్ ఫర్ లోకల్ లోకల్ ఫర్ గ్లోబల్ నినాదాలకు ప్రాముఖ్యత గుర్తించింది. అందుకోసమే ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్థానిక బ్రాండ్లతో కలసి పని చేస్తోంది. ఈ ఉద్దేశ్యంతో సంస్కృతి, సాంప్రదాయాలను ప్రదర్శించడమే కాకుండా హైదరాబాద్ ముత్యాలకు ప్రాచుర్యం కలిపించాలని నిర్ణయించింది. తద్వారా స్థానిక చిన్నవ్యాపారాలకు సహాయం అందిస్తుంది. ముత్యాలతో ప్రత్యేకమైన క్రిస్మస్ ట్రీని రాడిస్సన్ హైటెక్ సిటీ హైదరాబాద్ రాదేకృష్ణ జెమ్స్ అండ్ జ్యూవెలరీ సంస్థతో కలసి రూపొందించారు. ఇందుకోసం 25 వేలకు పైగా ముత్యాలను వినియోగించారు. ఇంతటి అరుదైన ఈ క్రిస్మస్ ట్రీని శుక్రవారం ఈ హోటల్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా రాడిస్సన్ హైటెక్ సిటీ హైదరాబాద్ హోటల్ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ మాట్లాడుతూ స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం కలిపించడమే లక్ష్యంతో ఈ వినుత్నమైన కార్యక్రమానికి స్వీకారం చుట్టామని చెప్పారు.