Home » కొండాకల్ లో ‘బిలాదాఖలా’ బాగోతం

కొండాకల్ లో ‘బిలాదాఖలా’ బాగోతం

by Admin
9.6kViews
95 Shares

* సుమారు 90 ఎకరాల భూమి పై కన్ను.

* 117 ఎకరాల 16 గుంటల భూమి.

* క్రయావిక్రాయాలు మే నెల నుండి ప్రారంభం.

* ధరణి లో భూమి కొన్న వారి పేర్లు మాయం.

* అక్రమార్కులతో అధికారులు కుమ్మక్కాయ్యారంటు స్థానికుల ఆరోపణ.

తెలంగాణ మిర్రర్, శంకర్పల్లి : కొండకల్ గ్రామంలో అక్రమ భూదందాకు తెరలేచింది. రెవెన్యూ అధికారుల అండదండలతోనే వందల కోట్ల ప్రభుత్వ భూమి పరుల పాలవుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవిన్యూ రికార్డులలో లేని భూమి, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ చేసుకునే బడా బకాసురుల పేరిట పట్టా కావడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. కొండకల్- మోకిల గ్రామాల సరిహద్దు లో గల కొండకల్ రెవిన్యూ పరిధిలో సుమారు 96 ఎకరాల బిలా దాఖలా భూమి ఉంది. బిలా దాఖలా భూమి అనగా సర్వే నెంబర్ లేని ప్రభుత్వ భూమి. అయితే ఈ ప్రభుత్వ భూమిలో చాలా సంవత్సరాల నుంచి కొండకల్ కు చెందిన సుమారు 40-50 మంది రైతులు కబ్జా లో ఉంటూ సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ పేరున భూమి రెవెన్యూ రికార్డులలో నమోదు కానందున రైతులు ఎన్నో మార్లు అధికారులకు ఆర్జీలు పెట్టుకున్నారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలోని పరిగి లో జరిగిన బహిరంగ సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో అప్పట్లో కొండకల్ రైతులకు లావానీ పట్టా భూమి గా పట్టా పాస్ పుస్తకాలు అందజేశారు. సర్వే నెంబర్ లేని ప్రభుత్వ బిలా దాఖలా భూమికి సర్వేనెంబర్ 555 గా నమోదు చేసి లావాని పట్టా భూమిగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలను అందజేసిన విషయం విధితమే. కానీ రెవెన్యూ అధికారులు రైతులకు లావాని పట్టా భూమిగా పాస్ పుస్తకాలు అయితే ఇచ్చారు కానీ…. రెవెన్యూ రికార్డులలో మాత్రం రైతుల వివరాలను నమోదు చేయలేదు( పొందుపరచలేదు). అప్పటినుంచి ఇప్పటివరకు ఆ భూమి బిలా దాఖలా భూమి గానే రెవెన్యూ రికార్డులలో కొనసాగుతూ వచ్చింది. కాగా రెవెన్యూ రికార్డులలో బిలా దాఖల భూమి గా ఉండటం, సాగు చేసుకుంటున్న రైతుల వద్ద లావాని పట్టా పాస్ పుస్తకాలు ఉండడం తో ఆ భూమిపై అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వం ఈ భూమిని ఎప్పటికైనా, ఎలాగైనా తీసుకుంటుందని కొందరు ప్రచారం చేయడం మొదలెట్టారు. ఆలస్యమైతే ఆశాభంగం, త్వరపడితే నాలుగు నూకలైనా మిగులుతాయని మధ్యవర్తులు రైతులను భయపెట్టడం జరిగిందని వినికిడి. రైతుల భయాన్ని ఆసరాగా చేసుకున్న బడా వ్యక్తులు రైతులను సంప్రదించారు. బ్రోకర్లు, బడా వ్యక్తులు కలిసి రైతులను నిండా ముంచే పనికి శ్రీకారం చుట్టారు. ఒక ఎకరా సుమారుగా రూ. 15-20 కోట్లు పలికే భూమికి సుమారు రూ 1 కోటి 40 లక్షలు నుంచి 2 కోట్ల 20 లక్షలు వరకు ఎకరాకు ధర పెట్టి కొనుగోలు చేస్తున్నారు.

కొనుగోలు చేస్తే తప్పేముంది అనుకుంటున్నారా…

ఇక్కడే ఉంది గురూ తిరకాసంతా… ఏదైనా భూమిని ఓ వ్యక్తి కొనుగోలు చేయాలంటే ఆ భూమిని అమ్మే వ్యక్తిపై ధరణిలో పట్టా భూమిగా నమోదై ఉండాలి. కానీ ఇక్కడ అంతా ఆ నిబంధనలు తూచ్…. బిలా దాఖలా భూమిని కొనుగోలు చేసే వ్యక్తులే నగరంలో స్లాట్ బుక్ చేస్తారు. భూమిని అమ్మాలనుకునే వ్యక్తి పేరున రిజిస్ట్రేషన్ రోజున ఎన్నడూ లేనిది రెవెన్యూ రికార్డు అయిన ధరణిలో పట్టా భూమిగా ప్రత్యక్షమవుతుంది. దీంతో ఏ బాధరా బంది లేకుండా దర్జాగా భూమి రిజిస్ట్రేషన్ అవుతున్నది. అంతకుముందు రెవెన్యూ రికార్డులలో నమోదు కానీ భూమి, రైతు అమ్మినట్లు అక్రమార్కులు కొన్నట్లు ధరణిలో ఎం ఎస్ వినాయక డెవలపర్స్ పేరిట రిజిస్ట్రేషన్ అవుతున్నది. వినాయక డెవలపర్స్ పేరుతో పాటుగా మరికొందరి బినామీల పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అక్రమ భూ దందాకు తెరలేచింది. అయితే ధరణిలోని రికార్డులలో గల గ్రామ రెవెన్యూ మ్యాప్ లో ప్రస్తుతం 555సర్వే నెంబర్ కనిపించకపోవడం కొసమెరుపు.

ఈ విలువైన భూమి రేడియల్ రోడ్డు ప్రక్కనే…

వందల కోట్ల విలువైన సర్వే నెంబర్ లేని ఈ ప్రభుత్వ భూమి తెల్లాపూర్ నుంచి ఈర్లపల్లి వరకు వచ్చే 100 పీట్ల రేడియల్ రోడ్డు పక్కనే ఉంది. అదే విధంగా కొండకల్ ఆర్-1 జోన్ పరిధిలో ఉండడం తో భూముల ధర కోట్లలో పలుకుతున్నది. దీంతో అక్రమార్కులు అనుకున్నదే తడువుగా తమ ప్లాన్ ను సన్న, చిన్న కారు రైతులపై అమలు చేస్తున్నారు. రెవెన్యూ రికార్డులలో నమోదు కాని బి లా దాఖల ప్రభుత్వ భూమిని సుమారు ఆరు నెలల కిందటే ఏడి సర్వే చేయించి రైతుల వివరాలను గుట్టు చప్పుడు కాకుండా నమోదు చేశారని వినికిడి. ఆ వివరాలు రెవెన్యూ రికార్డులలో కనిపించకుండా, భూమిని అమ్మే వ్యక్తి కి సంబంధించిన వివరాలు మాత్రమే విక్రయించే రోజున కనిపించేటట్లుగా చేస్తున్నారు. ఏడి సర్వే వివరాలను రైతులతో పాటుగా ఇతరులు ఎవరికి ఇవ్వడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు.

అన్నీ అంతు చిక్కని ప్రశ్నలే….?

అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి బహిరంగ సభలో రైతులకు సర్వేనెంబర్ 555 పేరిట లావాని పట్టా భూమిగా పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చారు. కాగా రెవెన్యూ రికార్డులలో నమోదు చేయకపోవడంతో ఆ భూమి బిలా దాఖలా భూమి గానే ఉంది. అక్రమ భూధందా కు తెరలేవడంతో ఉన్నట్టుండి రైతుల పేరిట రిజిస్ట్రేషన్ రోజు రికార్డులలో ప్రత్యక్షం కావడం ఒక ఎత్తు అయితే. రైతుల వద్ద ఉన్న లావానీ పట్టా భూమి పాస్ పుస్తకాల ప్రకారం…. భూమిని ఎవరు అమ్మ వద్దు కొనవద్దు. ఎవరైనా భూమిని కొన్న అది చెల్లుబాటు కాదనే విషయం తెలిసిందే. దాన్ని ఒకవేళ కొనుగోలు చేసిన రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకొని తిరిగి రైతులకే ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రజా ఉపయోగార్థం లావాని పట్టా భూమిని ప్రభుత్వమే తీసుకుంటుందనే విషయం జగమెరిగిన విషయమే. ప్రభుత్వ భూమి పట్టా భూమిగా ఎప్పుడూ రికార్డుల్లోకి ఎక్కింది….? లావాని పట్టా భూమి పట్టా భూమిగా ఎలా మార్పు చెందింది. రెవెన్యూ రికార్డులలో ఎవరు నమోదు చేశారు. భూమిని కొనుగోలు చేసే రోజునే ధరణిలో రైతుల వివరాలు ఎలా ప్రత్యక్షమవుతున్నాయి. ఆరోజు నుంచే సర్వేనెంబర్ 555 పేరిట ధరణిలో కనిపించడంపై మిలియన్ డాలర్ ల ప్రశ్నగా మారింది. ఈ కథంగమంతా భూ పరిపాలన సంబంధ అధికారులు, రెవెన్యూ అధికారుల కనసన్నల్లోనే జరుగుతున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రభుత్వానికైనా , రైతులకైనా దక్కాలి…. కానీ భూ బకాసురుల పాలు కాకుండా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని భూమిని కాపాడాలంటూ గ్రామస్తులు కోరుచున్నారు.

You may also like

Leave a Comment