
తెలంగాణ మిర్రర్,శేరిలింగంపల్లి : తొమ్మిదిన్నరేళ్ల భారాస పాలనలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మియాపూర్‌లో జరిగిన శేరిలింగంపల్లి నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తొమ్మిదన్నరేళ్లలో కులం మీద కుంపటి, మతాలు మీద మంటలు పెట్టలేదు, ప్రాంతం పేరు మీద పంచాయతీ పెట్టలేదు సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం దేశ వ్యాప్తంగా కొత్త పంథాను సీఎం కెసిఆర్ తీసుకొని వచ్చారని చెప్పారు. కేసీఆర్ ని కాదు అని కులం, మతం పిచ్చోళ్ళని నెత్తికి ఎక్కించుకుందామా? అని ప్రశ్నించారు. శేరిలింగంపల్లి ని 9 సంవత్సరాలలో 9వేల కోట్ల రుపాయలతో అభివృద్ధి చేశామని అన్నారు.. ఎన్నికల్లో ఎమ్మెల్యే గాంధీని మరోసారి ఆశీర్వదించాలి. ఒక్క వైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్ధిక సహాయం, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టినం. ఇంటి ముందే అభివృద్ధి కంటి ముందే. మూడో సారి అధికారంలోకి రాగానే సౌభాగ్యలక్ష్మి కార్యక్రమం అమలు చేస్తాం. అర్హులైన మహిళలు అందరికి 3 వేల రూపాయిలు అందిస్తామని కేటీఆర్ తెలిపారు. కొత్త వాళ్లు వస్తే మొత్తం గందరగోళం అవుతుంది. వాళ్లకు పరిస్థితి అర్థం అయ్యే సరికి ఉన్న కాలం గడిచిపోతుంది. ఇప్పటికే రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకున్న వాళ్లు వస్తేనే బాగుంటుంది. తెలంగాణలో పాలకులు ఎవరు ఉండాలో తేల్చాల్సింది దిల్లీలో ఉన్నవారు కాదు. కాంగ్రెస్‌లో ఇప్పటికే 11 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. మన రాష్ట్రంపై పొరుగు రాష్ట్ర నాయకుల దాడి ఎందుకు? టికెట్ల కోసం, బీఫారాల కోసం దిల్లీ చుట్టూ తిరిగే నాయకులు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. 60ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కరెంట్ సమస్యను పరిష్కరించలేకపోయింది. వాళ్ల పదవులు తప్ప ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు’’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.